'వట్టి' బెదిరింపులపై గట్టి దర్యాప్తు
విశాఖపట్నం: ఎండాడలోని ఇస్కాన్ ఆలయం దగ్గర ఓ ప్రైవేట్ స్థల వివాదంలో మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, కొణతాల రామ్మోహన్‌పై ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వసంతకుమార్, రామ్మోహన్‌లపై బి.శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని, మాజీ మంత్రి బెదిరిం చడం వాస్తవమని తెలితే అరెస్ట్ చేస్తామని నగర డీసీపీ–1 రంగారెడ్డి 'సాక్షి'కి తెలిపారు. పోలీసులు, బాధితులు చెప్పిన వివరాలివి.
40 ఏళ్ల కిందట సర్వే నంబర్ 108/1లో వ్యాపారవేత్త చెరుకూరి వెంకటరాజు నుంచి 75 సెంట్ల స్థలాన్ని ప్రముఖ సినీ డైరెక్టర్ తల్లి కోడూరు రాజనందిని, సత్యనారాయణ ప్రసాద్, బలుసు రామారావులు చెరో 25 సెంట్ల చొప్పున కొనుగోలు చేశారు. అక్కడకు నాలుగేళ్ల తర్వాత చెరుకూరి వెంకటరాజు అనే వ్యక్తి రాజనందిని కొనుగోలు చేసిన భూమికి లేఅవుట్ పేరుతో నకిలీ డాక్యుమెంట్ సృష్టించి రహస్యంగా సంపుటూరి వెంకట రమణారెడ్డి అనే వ్యక్తికి అమ్మేశాడు. ఇది తెలిసిన ఆమె భీమిలి మున్సిఫ్ కోర్టులో కేసు వేశారు. కోర్టు ఆమెకు అనుకూలంగా డిక్రీ ఇచ్చింది. ఈ క్రమంలో రాజనందిని చెందిన స్థలాన్ని 2006లో సత్యనారాయణ ప్రసాద్ కొనుగోలు చేసి తన కుమారుడు శివకుమార్(బాధితుడు), కుమార్తె నగినా పేర్ల మీద చెరో 505 గజాలు చొప్పున 1010 గజాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించాడు. మిగతా భూమిని రోడ్డు కోసం వదిలేశాడు. అదే సమయంలో ఇదే భూమిని తనకు విక్రయించారని కొణతాల రామ్మోహన్ అనే వ్యక్తి బలుసు శివకుమార్‌పై కోర్టులో కేసు వేశాడు. దీనికి కోర్టు 'స్టేటస్ కో'ఆర్డర్ జారీ చేసింది. అప్పటి నుంచి ఆ భూమికి 'కేర్ టేకర్'గా ఒమ్మి కొండలరావును నియమించుకున్నారు.